
సూర్యాపేట, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ ఎంపీ పాత్రపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజాలను ప్రజలకు వివరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. శనివారం సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ప్రభుత్వం బడా కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబట్టే ప్రయత్నాన్ని మానుకొని, యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఫార్మా భూముల రైతులకు 125 గజాల ఇంటి స్థలం, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో కబ్జాకు గురైన పేదల భూములను తిరిగి అప్పగించాలన్నారు. సీఎం వెంటనే స్పందించి అటవీ, ఫార్మా భూముల రైతులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. దేశవ్యాప్తంగా వెంటనే కుల గణన చేపట్టి లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి పాల్గొన్నారు.